అమెరికా తన సైన్యాన్ని సిరియా నుండి ఉపసంహరించుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం సిరియాలోని హసకా ప్రావిన్స్ లో ఉన్న కీలకమైన ఖస్రాక్ వైమానిక స్థావరాన్ని అమెరికా దళాలు పూర్తిగా ఖాళీ చేశాయి. భారీ సైనిక సామగ్రితో కూడిన చివరి కాన్వాయ్ ఈ స్థావరాన్ని వీడింది. దీంతో సిరియాలో అమెరికా తన ప్రధాన సైనిక ఉనికిని దాదాపుగా ముగించినట్లయింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఇది ఆకస్మిక నిర్ణయం కాదని, ఒక వ్యవస్థీకృత ప్రణాళికాబద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉగ్రవాద నిర్మూలనలో తమ మిత్రదేశాలకు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైన్యం నిష్క్రమణను సిరియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. తమ దేశ భూభాగంపై తిరిగి నియంత్రణ సాధించడాన్ని "సార్వభౌమాధికార పునరుద్ధరణ"గా సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిరియా ప్రభుత్వం, కుర్దిష్ యోధుల మధ్య కుదిరిన కీలక ఒప్పందమే ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐసిస్ ఉగ్రవాదులపై విజయం సాధించిన అనంతరం, సుమారు 5,700 మంది ఉగ్రవాదులను ఇరాక్ జైళ్లకు తరలించి విచారణ చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి తీసుకువచ్చే ప్లాన్ అమలు చేస్తున్నారు. యురేనియం సరఫరాకు సంబంధించి ఇరాన్ ఒప్పందానికి అంగీకరించిందని ట్రంప్ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే, ఇరాన్ మాత్రం అవన్నీ "అబద్ధాలు" అని కొట్టిపారేస్తోంది. ఈ సమయం చాలా కీలకమైనది. అమెరికా తన ప్రత్యక్ష సైనిక పోరాటాల కంటే, దౌత్యపరమైన ఒత్తిడితో ఇరాన్ను కట్టడి చేసేందుకే మొగ్గు చూపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సిరియా నుండి అమెరికా సేనల ఉపసంహరణ : చారిత్రాత్మక విజయంగా అభివర్ణించిన సిరియా ప్రభుత్వం
April 17, 2026
0
Tags