వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ : ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనున్న వేదాంత

Telugu Lo Computer
0


వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత అవి మొత్తం 6 షేర్లు అవుతాయి. వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ & గ్యాస్,వేదాంత స్టీల్ & ఫెర్రస్, వేదాంత బేస్ మెటల్స్, వేదాంత పవర్ గా విడగొడుతున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు. వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను విక్రయించడం ద్వారా ఈ అప్పు తీర్చడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ల మార్కెట్ క్యాప్, ఐదు కంపెనీలు విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విలువను సంతరించుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆయిల్, గ్యాస్, పవర్ వంటి అన్ని వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కింద ఉండేవి. ఇకపై ఇన్వెస్టర్లు తమకు నచ్చిన రంగంలో (ఉదాహరణకు కేవలం పవర్ లేదా ఆయిల్ రంగంలో మాత్రమే) పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రతి కంపెనీకి ప్రత్యేక బోర్డ్, యాజమాన్యం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వేదాంత ఇన్వెస్టర్లకు ఒక లాటరీ వంటిదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default