అమెరికా భారీగా బలగాలను ఇరాన్ వైపుగా తరలిస్తోంది. శక్తిమంతమైన యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహాం లింకన్'తోపాటు గైడెడ్ మిసైల్స్ తో కూడిన డెస్ట్రాయర్ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయి. మొన్నటివరకూ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌకలు భారీ సంఖ్యలో ఫైటర్ జెట్ లతో సహా గల్ఫ్ వైపు ప్రయాణిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నిరసనకారులను కాల్చి చంపుతున్న ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామని చెప్తూ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం దావోస్ వేదికగా దీనిపై స్పందించారు. తాను సైనిక చర్య చేపడతానని హెచ్చరించడంతో ఇరాన్ 840 మంది నిరసనకారులకు మరణశిక్షలను నిలిపివేసిందన్నారు. అందుకే ఆ దేశంపై సైనిక చర్య అవసరం లేదని, చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఆ మరుసటి రోజే ఇరాన్ వైపుగా అమెరికా యుద్ధనౌకలు కదులుతున్నాయని చెప్పారు. ఇరాన్‌పై దాడి చేయాలని అనుకోవడంలేదని, కానీ ఆ దేశంలో పరిస్థితిని గమనిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా, యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ తోపాటు ఇతర యుద్ధనౌకలు కొద్దిరోజుల్లోనే గల్ఫ్ ప్రాంతానికి చేరుకోనున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే.. ఇరాన్ కూడా అమెరికా బలగాలతోపాటు ఇజ్రాయెల్ పైనా ప్రతిదాడులకు దిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇజ్రాయెల్ హైఅలర్ట్ అయింది.
ఇరాన్ వైపు కదులుతున్న అమెరికా యుద్ధ నౌకలు
January 24, 2026
0
Tags