తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

Telugu Lo Computer
0


తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారైయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం 121 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో 5 స్థానాలు ఎస్టీలకు, 17 ఎస్సీలకు, 38 బీసీలకు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో స్థానిక పాలనలో మహిళల పాత్ర మరింత బలపడుతుందని ఆమె చేప్పారు. కార్పొరేషన్ల వారీగా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, రామగుండం కార్పొరేషన్‌ను ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ బీసీ మహిళలకు దక్కగా, మంచిర్యాల, కరీంనగర్‌ కార్పొరేషన్లు బీసీ జనరల్‌ కేటగిరీలోకి వెళ్లాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని మహిళా జనరల్‌గా ప్రకటించారు.  గ్రేటర్‌ వరంగల్‌ను జనరల్‌ కేటగిరీకి కేటాయించగా, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ కార్పొరేషన్లను మహిళా జనరల్‌ రిజర్వేషన్‌లో చేర్చారు. ఈ నిర్ణయాలతో ఆయా నగరాల్లో మహిళా నాయకత్వం మరింత బలోపేతం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారుతో ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి అభ్యర్థుల ఎంపికపై పడింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్‌ ఎక్కువగా ఉండటంతో కొత్త ముఖాలకు అవకాశం లభించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సామాజిక వర్గాల వారీగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ రిజర్వేషన్లలో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default