జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, సరండ అటవీ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ నాయకుడు మిసిర్ బెస్రాతో పాటు మరికొందరు కీలక సభ్యులు ఉన్నట్లుగా సమాచారం. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సంరండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జార్ఖండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కోబ్రా 209 బెటాలియన్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి ధీటుగా భద్రతా బలగాలు ఎదురుదాడి చేయడంతో గంటల పాటు భీకర పోరు కొనసాగింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు సద్దుమణిగినప్పటికీ, మరికొంతమంది మావోయిస్టులు అడవిలో నక్కి ఉండే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి. అదనపు దళాలను ఘటనా స్థలానికి తరలించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
జార్ఖండ్ లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు : 10 మంది మావోయిస్టులు మృతి
January 22, 2026
0
Tags