కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా రాజ్‌కుమార్‌ గోయల్ నియామకం

Telugu Lo Computer
0


కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నూతన ప్రధాన కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మందిని కమిషనర్లుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.కొత్తగా నియమితులైన వారిలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి వంటి ప్రముఖులు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజ్‌కుమార్‌ గోయల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలతో సీఐసీలో ఖాళీగా ఉన్న చీఫ్‌ సహా మొత్తం 9 పోస్టులు భర్తీ అయ్యాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయనుండటం గమనార్హం.గత ఏడాది సెప్టెంబర్‌లో చీఫ్ కమిషనర్ హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేయగా, మిగిలిన కమిషనర్ల పోస్టులు 2023 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ నియామకాల ఎంపిక ప్రక్రియపై విపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ ఆయన కమిటీ సమావేశంలో అసమ్మతి నోట్ సమర్పించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default