ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు, మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 'ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం. ఈ రెండు నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అమరావతికి రూ.2500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా కలిసి ఆయా జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది. రాష్ట్రానికి రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు రానున్నాయి. వివిధ ప్రాజెక్టుల రూపంలో దాదాపు రూ.80 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తున్నాయి. కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు వస్తాయి'' అని పెమ్మసాని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇస్తుందని ఎవరూ ఊహించలేదు : పెమ్మసాని
July 28, 2024
0
Tags