ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. విద్యుదీకరణలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మునుమాక నుంచి నరసరావుపేట మీదుగా సాతులూరు వరకు 16.6 కిలోమీటర్ల లైన్ ను పూర్తి చేశారు. దీనివల్ల గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలోని జగ్గంభొట్ల కృష్ణాపురం వరకు 176 కిలోమీటర్ల రెండో లైన్, విద్యుదీకరణ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు-గుంతకల్లు మధ్య 401 కిలోమీటర్ల రెండో లైన్ నిర్మాణం, విద్యుదీకరణ ప్రాజెక్ట్ 2016-17లో మంజూరైంది. ఇప్పటి వరకు నల్లపాడు-సాతులూరు మధ్య 32 కిలోమీటర్లు, మునుమాక-జగ్గంభొట్ల కృష్ణాపురం మధ్య 122 కిలోమీటర్లు, డోన్-గుంతకల్లు మధ్య 68 కిలోమీటర్లు, బేతంచెర్ల-మల్కాపురం మధ్య 23 కిలోమీటర్ల మార్గాలను పూర్తిచేశారు. పూర్తయినవన్నీ కలిపి 245 కిలోమీటర్ల లైన్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పుడు మునుమాక-సాతులూరు మధ్య రెండోలైన్ పూర్తికావడంతో 261.6 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చినట్లైందని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, కటక్, పూరీ, భువనేశ్వర్, కోల్‌కతాకు కొత్త రైళ్లు అందుబాటులోకి రావడంతోపాటు ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు, కొత్త రైళ్లను నడిపేందుకు వీలు కలుగుతోంది. రెండోలైను రావడంవల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దీనివల్ల రాయలసీమకు ఎంతో ప్రయోజనం కలగబోతోంది. కోస్తా ప్రాంతానికి అనుసంధానం వేగంగా జరుగుతుంది. గూడ్స్ రైళ్ల ద్వారాఆదాయం పెరుగుతుంది. చెన్నై-కోల్ కతా రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ లైన్ ను ఉపయోగించొచ్చని అధికారులు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం నాలుగు జిల్లాల మీదుగా ఇది వెళుతుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
శరవేగంతో జరుగుతున్న గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం !
June 23, 2024
0
Tags