రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌ అధిగమించే అవకాశం !

Telugu Lo Computer
0

రాబోయే ఐదేళ్లలో ఏఐ మానవ మేధస్సును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌ అధిగమించే అవకాశం ఉందని, మరో పదేళ్లలో హ్యూమనాయిడ్ రోబోలు భారీ సంఖ్యలో అందుబాటులోకి రావచ్చని టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు. వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు ఉండే అవకాశం ఉంది. ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయగలిగితే.. ఈ రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవ శక్తిని మించిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ, రోబోటిక్స్‌ అభివృద్ధి కారణంగా రొటీన్‌ పనులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోడింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌, డేటా విశ్లేషణ, అకౌంటింగ్‌, డాక్యుమెంటేషన్‌, కంటెంట్‌ తయారీ వంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత టూల్స్‌ ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. భవిష్యత్తులో హ్యూమనాయిడ్‌ రోబోలు కూడా పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, లాజిస్టిక్స్‌, రోజువారీ సేవల్లోకి భారీగా ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో కొన్ని రకాల ఉద్యోగాల్లో మానవుల అవసరం తగ్గవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త టెక్నాలజీతో పాటు కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్‌ రోబోల సామర్థ్యం కేవలం మనుషులు నిర్దేశించిన పనులు చేయడానికే పరిమితం కాకపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రోబోలు ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటే.. వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒక హ్యూమనాయిడ్‌ రోబో సామర్థ్యం ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఏఐ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యం, రోబోలోని ఏఐ చిప్‌ శక్తి, అలాగే వస్తువులను పట్టుకోవడం, కదిలించడం వంటి మెకానికల్‌ నైపుణ్యాలు కీలకమని చెప్పారు. ఈ మూడు విభాగాల్లో వేగంగా పురోగతి సాధిస్తుండటంతో రోబోల పనితీరు కూడా భారీగా పెరగవచ్చని మస్క్ అంచనా వేశారు. టెస్లా ఇప్పటికే ఆప్టిమస్‌ పేరుతో హ్యూమనాయిడ్‌ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన, మనుషులకు విసుగు కలిగించే పనులను రోబోలతో చేయించాలన్నది సంస్థ లక్ష్యం. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఆప్టిమస్‌ రోబోలను తయారు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు చైనా కూడా హ్యూమనాయిడ్‌ రోబోటిక్స్‌లో వేగంగా ముందుకు వెళ్తోంది. రోబోట్ల తయారీ, పరిశోధన, వాణిజ్య వినియోగంలో చైనా సంస్థలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి. రోబోల సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ మరింత తీవ్రం కానుంది. ఏఐ, రోబోలు భారీ స్థాయిలో వస్తువులు, సేవలను తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగితే.. భవిష్యత్తులో సంపద, డబ్బు ప్రాధాన్యత కూడా మారవచ్చని మస్క్ మరో ఆసక్తికరమైన అంచనా వేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి వస్తే.. కేవలం జీవనోపాధి కోసం పనిచేయాల్సిన అవసరం తగ్గవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం అనేది తప్పనిసరి అవసరం కాకుండా.. వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి లేదా సంతృప్తి కోసం చేసే పనిగా మారే అవకాశం ఉందన్నది మస్క్‌ అంచనా.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default