అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో వంటగ్యాస్ ధరల నిర్వహణ మరియు సబ్సిడీల కేటాయింపులపై కేంద్ర పెట్రోలియం శాఖ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నుంచి దేశీయ వినియోగదారులను రక్షించేందుకు ప్రభుత్వం భారీగా ఆర్థిక భారాన్ని మోస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. ఫిబ్రవరి నుంచి సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఏకంగా 46 శాతం పెరగడంతో ప్రస్తుతం దేశంలో ఒక సిలిండర్ సరఫరా వ్యయం రూ.1,600 దాటిందని, అయినప్పటికీ మార్కెట్ ధర కంటే సుమారు రూ.700 తక్కువకే (అండర్ రికవరీ భరిస్తూ) ప్రభుత్వం సిలిండర్‌ను అందిస్తోందని కేంద్రం వివరించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాల కంటే కూడా భారత్‌లోనే వంటగ్యాస్ ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయని గణాంకాలతో సహా సమర్థించుకుంది. పేద ప్రజలపై భారం పడకుండా 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' లబ్ధిదారులకు ఏడాదికి మొదటి నాలుగు రీఫిల్‌లపై సిలిండర్‌కు రూ.300 చొప్పున అదనపు సబ్సిడీని ఇస్తున్నామని, సాధారణ కుటుంబాలు కూడా మార్కెట్ రేటు కంటే ₹700 తక్కువకే గ్యాస్ పొందుతున్నాయని గుర్తుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఇంధన రవాణాను సురక్షితంగా కొనసాగిస్తూ దేశంలో ఎక్కడా పెట్రోలియం ఉత్పత్తుల కొరత రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుందని పెట్రోలియం శాఖ సమర్థించుకుంది.