తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ మహిళ సర్జరీకి 'సీఎంఆర్‌ఎఫ్' నిధులు విడుదల


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం పట్ల ఒక అద్భుతమైన మానవీయ నిర్ణయాన్ని తీసుకుంది. ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ నిధులు విడుదల కాగా, సదరు మహిళకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. క్వీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం. ముకందమాల ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రతినిధులు సచివాలయంలో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ సమాజానికి అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, సమాజంలో వారి సమగ్రత కోసం సీఎం రేవంత్‌రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారని ముకందమాల కొనియాడారు. థర్డ్ జెండర్ వర్గాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ, వారు గౌరవప్రదంగా జీవించే హక్కును ఈ ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎల్‌జీబీటీక్యూ సమాజ సభ్యుల, ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం మరిన్ని సానుకూల నిర్ణయాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org