61 ఎర్రచందనం దుంగల స్వాధీనం : 8 మంది అరెస్ట్ : ఒక ట్రాక్టర్, రెండు కార్లను ఘటనా స్థలంలో సీజ్

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 61 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ఒక ట్రాక్టర్, రెండు కార్లను ఘటనా స్థలంలో సీజ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ సమాచారం ప్రకారం.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కృపానంద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ నేతృత్వంలోని పోలీస్ బృందం గూడూరు అటవీ ప్రాంతంలోని కొండగుంట-మేకనూరు మార్గంలో శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఆ సమయంలో అటవీ ప్రాంతం నుంచి అనుమానాస్పద శబ్దాలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై సోదాలు చేపట్టారు. అక్కడ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ట్రాక్టర్, దాని సమీపంలో పార్క్ చేసి ఉన్న రెండు కార్లతో పాటు కొందరు వ్యక్తులు కనిపించారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రాక్టర్‌లో ఉన్న 24 దుంగలు, నేలపై పడి ఉన్న మరో 22 దుంగలతో కలిపి మొత్తం 46 దుంగలను ప్రాథమికంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన నిందితులను తమదైన శైలిలో విచారించగా, అటవీ ప్రాంతంలో మరోచోట నిల్వ ఉంచిన ఎర్రచందనం గుట్టును వారు రట్టు చేశారు. అక్కడ దాచిన మరో 15 దుంగలను కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న దుంగల సంఖ్య 61కి చేరింది. పట్టుబడిన ఎనిమిది మంది నిందితులతో పాటు 61 ఎర్రచందనం దుంగలు, ట్రాక్టర్, రెండు కార్లను తదుపరి విచారణ నిమిత్తం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Post a Comment

Previous Post Next Post
3