జమ్మూ రైల్వే స్టేషన్కు సమీపంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన 'శివ్ మార్కెట్ లో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర షాపులకు విస్తరించాయి. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 40 దుకాణాలు పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయని అధికారులు సోమవారం తెల్లవారుజామున వెల్లడించారు. ఈ మార్కెట్లో ప్రధానంగా డ్రై ఫ్రూట్స్, ఉన్ని దుప్పట్లు, నిత్యావసర ఆహార పదార్థాలు, చిన్న తరహా తినుబండారాల దుకాణాలు ఉండటంతో నిప్పంటుకుని మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బలమైన గాలుల కారణంగా మంటలు అదుపులోకి రాకపోవడంతో దాదాపు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించి తెల్లవారుజామున మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఒక దుకాణంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం మొదలై మార్కెట్ అంతటా వేగంగా వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. జీవనాధారమైన దుకాణాలు కళ్లముందే కాలి బూడిదై కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
