ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళా కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడిన మాయగాడు : 20 మందినుంచి రూ. 24 లక్షలు కాజేసిన నిందితుడు

ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళా కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ 23 ఏళ్ల విక్రాంత్ తోమర్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తాను బడా వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్ల నుంచి సుమారు రూ. 24 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. కరెల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి డబ్బులు గుంజారని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు బురారీ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ వలలోకి దించినట్లు తేలింది. నిందితుడు విక్రాంత్ విలాసవంతమైన కార్లను 8 గంటల పాటు అద్దెకు తీసుకుని వారిని బయటకు తీసుకెళ్లేవాడని, తన విలాసవంతమైన జీవన విధానాన్ని చూపి వారి నమ్మకాన్ని చూరగొన్న తర్వాత పలు కారణాలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని దర్యాప్తులో తేలింది. నిందితుడితో సహజీవనం (లివ్-ఇన్ పార్ట్‌నర్) చేస్తున్న యువతి కూడా ఢిల్లీ పోలీసు విభాగంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తుండటం గమనార్హం. ఆమె ద్వారానే తన బ్యాచ్‌మేట్ల సమాచారాన్ని రాబట్టి వారిని విక్రాంత్ టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోసపోయిన బాధితుల్లో చాలామంది పరువు పోతుందన్న భయంతో ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ మోసాల ద్వారా వచ్చిన డబ్బును 'OneX' బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై మాయాపురి, హరి నగర్, ఇందర్‌పురి, ఈస్ట్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఐదు చీటింగ్ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది జూన్‌లోనే బెయిల్‌పై విడుదలయ్యాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Post a Comment

Previous Post Next Post
3