మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఆపరేషన్ ట్రైడెంట్ : 18 మంది అరెస్టు, రూ.వెయ్యి కోట్ల హవాలా లావాదేవీల గుర్తింపు

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 'ఆపరేషన్ ట్రైడెంట్' పేరుతో అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లో నిర్వహించిన సంయుక్త దాడుల్లో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 18 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలను గుర్తించినట్లు తెలిపారు. అక్టోబర్ 23న కేంద్ర దర్యాప్తు సంస్థలు, అస్సాం, మిజోరం, మణిపూర్ పోలీసు బలగాలు కలిసి 38 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్ భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఈ మార్గాన్ని ఆయన 'డెత్ ట్రయాంగిల్ కారిడార్'గా అభివర్ణించారు. డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అడ్డుకోవడంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. దేశంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని అమిత్ షా తెలిపారు. 2029 డిసెంబర్ 31 నాటికి డ్రగ్స్ నెట్‌వర్క్‌లను నిర్మూలించాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న కేంద్ర ఏజెన్సీలు, మూడు రాష్ట్రాల పోలీసు బలగాలను ఆయన అభినందించారు. 

Post a Comment

Previous Post Next Post
3