ప్రతిపక్ష నేతలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్‌డీఏ వైపు తిప్పుకుంటున్నారు : కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్

ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తూ, రెండేళ్ల క్రితం బీజేపీ వ్యతిరేక నినాదంతో గెలిచిన ప్రతిపక్ష నేతలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్‌డీఏ వైపు తిప్పుకుంటున్నారని, పార్టీ ఫిరాయించే నాయకులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని జైరాం రమేశ్ “మ్యూచువల్ ఫండ్స్” పెట్టుబడులతో పోల్చారు. ఎవరిని పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటున్నారో, వారి అవసరాలు మరియు బలహీనతలకు అనుగుణంగా అమిత్ షా బృందం ముందే ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇది కేవలం స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న చౌకబారు చర్య అని, అమిత్ షా రాజకీయ ఎత్తుగడలకు ఎలాంటి హద్దులు లేవని విమర్శించారు. అయితే, చివరికి ఆయన ఆశించిన దుష్టలక్ష్యం నెరవేరదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం మరోసారి చీలనుందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష ఎంపీలను అధికారపక్షం కొనుగోలు చేస్తోందని, అందుకోసం ఒక్కొక్కరికి రూ.15 కోట్ల అడ్వాన్స్ చెల్లిస్తున్నారనే నమ్మకమైన సమాచారం తనకు అందిందని శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కొనుగోలు రాజకీయాల వ్యవహారం అత్యంత అసహ్యకరంగా ఉందన్నారు. మరోవైపు ఉద్ధవ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీల్లో దాదాపు ఆరేడు మంది ఎంపీలు ఏక్‌నాథ్‌ శిండే  నేతృత్వంలోని అధికారిక శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని, అసమ్మతి నేతలకు తాము స్వాగతం పలుకుతామని శిండే వర్గ నేత ప్రతాప్ సర్నాయక్ సంకేతాలు ఇవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్న కొందరు ఉద్ధవ్ సేన ఎంపీలు హఠాత్తుగా తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఎంపీలందరికీ తక్షణమే ‘విప్’ జారీ చేసింది. ఢిల్లీలో జరగబోయే అత్యవసర సమావేశానికి ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేనిపక్షంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం