ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం పరిసరాల్లోని ఒక గ్రామంలో శుక్రవారం రాత్రి పెళ్లి సందడి తారాస్థాయికి చేరింది. మంగళ వాయిద్యాల హోరు, బంధువుల కోలాహలంతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. ముహూర్తం సమయానికి వధూవరులు జీలకర్ర బెల్లం కూడా పెట్టుకున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ వరుడి చేతికి మంగళసూత్రాన్ని అందిస్తున్న తరుణంలో సినిమా ఫక్కీలో ఒక యువకుడు హడావుడిగా మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే, అప్పటివరకు మౌనంగా ఉన్న వధువు ఒక్కసారిగా పీటల మీద నుంచి లేచి 'వచ్చేశావా!' అంటూ ఆనందంతో మండపం దిగి నేరుగా ఆ యువకుడి పక్కన నిలుచుంది. ఈ అనూహ్య పరిణామంతో వరుడు, అతడి తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వచ్చిన వ్యక్తి తన ప్రియుడని, తామిద్దరం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని వధువు తెగేసి చెప్పడంతో పెళ్లి నిలిచిపోయింది. తమ ఒక్కగానొక్క కుమారుడి వివాహాన్ని ఎంతో వైభవంగా చేయాలని భావించిన వరుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 'ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే రూ. 20 లక్షలు ఖర్చు చేశాం. వేల మంది భోజనం చేసి వెళ్లారు. చివరకు మా పరువు తీసి, పెళ్లి ఆపేశారు' అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వధువు నిర్ణయంతో ఆగ్రహించిన కొందరు బంధువులు ప్రియుడిపై చేయి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గొడవను సద్దుమణిగించారు.