ఉద్యోగులకు గోల్డ్ మెమెంటో ఇచ్చి సత్కరించిన చాంగ్ చెంగ్ హోల్డింగ్స్ సంస్థ


సింగపూర్‌కు చెందిన చాంగ్ చెంగ్ హోల్డింగ్స్ సంస్థ 32వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థలో పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించింది. 999 స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మెమెంటోలను బహుమతిగా అందించి గౌరవించింది. ఒక్కో మెమెంటో 20 నుంచి 30 గ్రాముల బరువుతో ఉండగా, ఒక్కదాని విలువ సుమారు మూడు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. సేవా కాలాన్ని ఆధారంగా తీసుకుని బహుమతుల బరువును నిర్ణయించారు. 10 నుంచి 14 సంవత్సరాలు పనిచేసిన వారికి 20 గ్రాముల బంగారం, 15 నుంచి 19 సంవత్సరాలు పూర్తిచేసిన వారికి 25 గ్రాములు, 20 ఏళ్లు పైగా సేవలందించిన వారికి 30 గ్రాముల గోల్డ్ మెమెంటో ఇచ్చారు. ప్రతి మెమెంటోపై కంపెనీ లోగో, ప్రధాన కార్యాలయ రూపురేఖలు, ఉద్యోగి సేవా సంవత్సరాలు చెక్కబడ్డాయి. ఈ వేడుకను కూడా అట్టహాసంగా నిర్వహించారు. 100కి పైగా టేబుళ్లతో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మొత్తం బహుమతుల విలువ సుమారు 500,000 సింగపూర్ డాలర్లు, అంటే దాదాపు రూ.3.5 కోట్లు. ఇది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి చిహ్నమని సంస్థ వ్యవస్థాపకుడు తెలిపారు. 1994లో చిన్న చైనీస్ వెజిటబుల్ రైస్ స్టాల్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు 160కి పైగా రెస్టారెంట్లు, 30కి పైగా కాఫీ షాపులు నడుపుతూ 1,200 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రయాణంలో ఉద్యోగులే బలమని గుర్తించి, వారికి బంగారంతో కృతజ్ఞత తెలిపిన తీరు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post
3