Ad Code

టీ20 ప్రపంచ కప్ 2026 : ఆసీస్‌పై జింబాబ్వే సంచలన విజయం


టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియాను జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్‌ బౌలర్‌ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, మ్యాట్‌ రెన్‌షా, ఆడమ్‌ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్‌ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్‌ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్‌ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్‌ (31) విఫలయత్నం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu