మెస్సీ ఆట చూసేందుకు హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ


హైదరాబాద్ లో జరిగే మెస్సీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ఏర్పాటు చేసిన ప్రత్యేక 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇకపోతే లియోనెల్ మెస్సీ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునున్నారు. మెస్సి రాక నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఇప్పటికే హై అలర్ట్‌లోకి వెళ్లింది. ఎయిర్‌పోర్టు పరిసరాలతో పాటు ఆయన ప్రయాణించే మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉప్పల్‌లో జరగనున్న ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు తరలివస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన ఘటనతో హైదరాబాద్‌లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు కారణమైంది. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సిని చూడటానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే నిర్వహణలో లోపాలు, సరైన పోలీస్ సమన్వయం లేకపోవడంతో మెస్సి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసి, స్టేడియంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. కోల్‌కతా ఘటనను అధ్యయనం చేసి, హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్, అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియం వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ స్టేడియం పరిసరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

Post a Comment

Previous Post Next Post
3