జయలలితకు చెందిన భవనాన్ని సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు


మిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేయడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భవనానికి సంబంధించి సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో, పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత బతికున్న కాలంలో ఈ భవనం ఆమెకు ఒక ప్రధాన ఆస్తిగా ఉండేది, కానీ ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వం, నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. జయలలిత మరణం తర్వాత ఆమె వందల కోట్ల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. 2020లో మద్రాస్ హైకోర్టు జయలలిత అన్న కుమారుడు జె. దీపక్, కుమార్తె జె. దీపలను ఆమెకు చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ నివాసం, జీడిమెట్ల వద్ద ఉన్న ద్రాక్ష తోట తో పాటు ఇతర అన్ని స్థిరాస్తులు వీరిద్దరికే చెందుతాయి. కోర్టు వారసులుగా ప్రకటించినప్పటికీ, ఈ ఆస్తుల అప్పగింత ప్రక్రియ , ఆదాయపు పన్ను శాఖ జరిపిన అటాచ్‌మెంట్‌ల వల్ల వీరు పూర్తిస్థాయిలో వీటిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని ఈ భవనంలో ఎవరూ ఉండటం లేదు. అది ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత మరణానంతరం ఈ భవన పర్యవేక్షణను చూసే వారు కరువయ్యారు. గతంలో ఇక్కడ కేవలం సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉండేవారు. వారసులుగా ప్రకటించిన దీప, దీపక్ లు చెన్నైలోనే నివసిస్తుండటం, హైదరాబాద్ లోని ఆస్తుల నిర్వహణపై వారు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు భవనం గేటుకు నోటీసులు అంటించి సీజ్ చేసినప్పుడు కూడా అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. జయలలిత ఆస్తులపై అప్పట్లో ఆదాయపు పన్ను శాఖ వేసిన కేసులు, అటాచ్‌మెంట్‌లు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీనికి తోడు, తమిళనాడు ప్రభుత్వం గతంలో ఈమె ఆస్తులను ప్రభుత్వ పరం చేసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత కోర్టు అడ్డుకోవడం వంటి పరిణామాల వల్ల వారసులు దీప, దీపక్ లు క్షేత్రస్థాయిలో ఈ ఆస్తులపై పూర్తి నియంత్రణ సాధించలేకపోయారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో, ఈ బకాయిలు చెల్లించి భవనాన్ని విడిపించుకోవాల్సిన బాధ్యత చట్టబద్ధ వారసులైన వారిద్దరిపైనే పడింది. ఒకవేళ వారు స్పందించని పక్షంలో అధికారులు తదుపరి వేలం ప్రక్రియకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం