తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు. ఈ జాబితాలో పలువురు పార్టీ ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. టీ నగర్ నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, మైలాపూర్ నుండి కోశాధికారి వెంకట్ రమణన్, విల్లివాక్కం నుండి ఆదవ్ అర్జున్ పోటీ చేయనున్నారు. జాబితా విడుదల సందర్భంగా విజయ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ప్రజల నిజమైన సంరక్షకులను పరిచయం చేస్తోన్నానంటూ అభ్యర్థుల గురించి వివరించారు. తమ అభ్యర్థులు సాధారణ నేపథ్యాల నుండి వచ్చారని, ఆస్తి- అంతస్తులు వారికి లేవని, అధికారం కోసం అర్రులు చాచే వారు కాదని విజయ్ వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారని భరోసా ఇచ్చారు. అవినీతిపరులైన ఇతర ఎమ్మెల్యేలా కాకుండా, నీతి- నిజాయితీతో వ్యవహరిస్తారని, ప్రజల పట్ల నిబద్ధత, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే ప్రజా ప్రతినిధి మాత్రమే కాదని, అసెంబ్లీకి సంరక్షకులు, ప్రజల గొంతుక అని అన్నారు. తాను ప్రతి అభ్యర్థిని జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేశాననని తెలిపారు. ఈ సందర్భంగా, ప్రజలకు టీవీకే, దాని ఎన్నికల గుర్తు విజిల్ కు ఓటు వేయమని విజయ్ పిలుపునిచ్చారు.
0 Comments