ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ భవనంతో పాటు బయట ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పోలీసులు బయటి నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామగ్రిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. పీఎస్ ఆవరణలో ఆ సామగ్రిని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్థానిక ఎస్సై తో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో స్టేషన్ లోపల ఉన్న ఫర్నిచర్ పూర్తిగా చిందరవందర అయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అంతేకాకుండా స్టేషన్ బయట నిలిపి ఉంచిన పోలీస్ వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే చల్లపల్లి సీఐ కేఎస్ రావు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను ఆరా తీస్తున్నారు. స్టేషన్‌లో భద్రతపరమైన లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
0 Comments