వయోజనులైన స్త్రీ-పురుషులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వివాహితుడైన పురుషుడు మరొక వయోజన మహిళతో కలిసి ఉన్నా, అది చట్టపరంగా నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అనమిక, నేత్రపాల్ అనే జంట తాము వయోజనులమని, ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తున్నామని కోర్టును ఆశ్రయించింది. కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే. మునిర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల డివిజన్ బెంచ్, పిటిషనర్లకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే జనవరి 8న అనామిక తల్లి కాంతి, షాజహాన్‌పూర్‌లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్‌లో నేత్రపాల్‌పై కేసు పెట్టింది. నేత్రపాల్ తన కుమార్తె అనామికను మాయమాటలతో లోబరుచుకుని తీసుకువెళ్లాడని ఆమె ఆరోపించింది. సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవని న్యాయమూర్తులు జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నేత్రపాల్ వివాహితుడు అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు తాను మేజర్ అని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే నేత్రపాల్‌తో సహజీవనం చేస్తున్నానని అనామిక పోలీసులకు స్పష్టం చేసింది. తమకు ప్రాణహాని ఉందని పిటిషనర్లు కోర్టుకు తెలపడంతో, వారి భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ (SP) వ్యక్తిగత బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించడం విశేషం. అలాగే ఈ జంటను నేరుగా గానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గానీ లేదా మూడవ వ్యక్తి ద్వారా గానీ సంప్రదించ కూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని కోర్టు కఠినంగా కుటుంబ సభ్యులను హెచ్చరించింది. 2018 నాటి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.
0 Comments