హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో పోలీసులపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను క్యాట్ వింగ్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఆపి ప్రశ్నించగా.. వాగ్వాదానికి దిగారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ ఖాద్రి అనే ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వారిని నిలదీశారు. అయితే, వారిని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన నిందితులు ఒక్కసారిగా రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో కానిస్టేబుళ్లపై దాడి పాల్పడ్డారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతుందని, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరించారు.
0 Comments