ఏప్రిల్ 25న మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్ వేదికగా పార్టీ జెండాను ఆవిష్కరించి, సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలకనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్, ఇప్పుడు తన లక్ష్యాలను విస్మరించిందని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, ఇది పార్టీ వైఫల్యమేనని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఉనికి ఇప్పుడు నామమాత్రమే. ఆ పార్టీలోని నిజమైన కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ ఇప్పుడు నా వెంటే ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక ప్రాంతీయ శక్తిగా మా పార్టీ ఎదగబోతోంది అని ఆమె ప్రకటించారు. తాను పెట్టబోయే కొత్త పార్టీని ఇతర పార్టీలకు బీ టీమ్‌గా అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఏ కొత్త ఆలోచన వచ్చినా ఇలాంటి ముద్రలు వేయడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె కొట్టిపారేశారు. నేను నిజామాబాద్ బిడ్డను. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచనైనా చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో తెలంగాణలో నంబర్ వన్ పార్టీగా మాదే ఉంటుంది. మాది ప్రజల ఇంటి పార్టీ గా మారి, రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు. తన కొత్త పార్టీలో పాత తరం రాజకీయాల కంటే యువతకు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం తనతోనే ఉందని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కొత్త పార్టీ అనివార్యమైందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మేడ్చల్ వద్ద ఉన్న మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ జెండాను ఆవిష్కరించి, అధికారికంగా పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పాలని కవిత వ్యూహరచన చేస్తున్నారు.
0 Comments