ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేట దినేష్ గ్రాండ్ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి శంకర కుమారి, ఐదేళ్ల కుమార్తె మౌనిక అక్కడికక్కడే మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో బాధితులను నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భర్త గోపి భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, భార్య శంకర కుమారి అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు చేరుకున్న ఈ కుటుంబం, లాడ్జిలో గది తీసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వైద్య వృత్తిలో ఉన్న వారు కావడంతో, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భోపాల్ నుండి నేరుగా వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న బలమైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
0 Comments