ఇరాన్‌పై భూతల యుద్ధానికి అమెరికా పెద్ద ఎత్తున సైనికులను మధ్యప్రాచ్యానికి పంపింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ ట్రీపోలి అనే ఆధునిక యుద్ధ నౌక ఇప్పటికే మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకుంది. ఈ యుద్ధ నౌకలో సుమారు 2,500 మంది అమెరికా మెరైన్స్ ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, ఓస్ప్రే విమానాలు, ఆధునిక యుద్ధ సామగ్రి వంటి వాటిని ఒకేసారి నిర్వహించే సామర్థ్యం ఇందులో ఉంటుంది. మొదట ఈ నౌక జపాన్‌లో నిలిచివుండగా, రెండు వారాల క్రితం మధ్యప్రాచ్యానికి పంపాలని ఆదేశాలు వచ్చాయి. యూఎస్ఎస్ బాక్సర్ యుద్ధ నౌకతో పాటు సాన్ డియాగో నుంచి మరిన్ని నౌకాదళ బలగాలు కూడా మధ్యప్రాచ్యానికి పంపుతున్నారు. కాగా అమెరికా చేపట్టిన "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" అనే సైనిక చర్యలో ఇప్పటివరకు 11,000 కంటే ఎక్కువ లక్ష్యాలను దాడి చేసినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా దాడులు కొనసాగిస్తోంది. ఇటీవల ఇరాన్ సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తోంది. ఈ ప్రాంతం ప్రపంచ చమురు రవాణాకు కీలకం కావడంతో.. ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇంధన ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దళాలు మరింత క్లిష్టంగా మార్చింది. ఇరాన్ మద్దతుతో ఉన్న ఈ హౌతీ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగం చేసినట్లు ప్రకటించింది. దీంతో ముఖ్యమైన సముద్ర మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
0 Comments