Ad Code

పాక్ ద్వారా 15 అంశాలతో కూడిన ముసాయిదాను ఇరాన్ కు పంపిన అమెరికా : నిర్ద్వందంగా తిరస్కరించిన ఇరాన్


పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌ ముందు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని ఉంచింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాలతో కూడిన ఒక ముసాయిదాను పాక్ ద్వారా ఇరాన్‌కు పంపారు. ఇరు దేశాలు అంగీకరిస్తే ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే అమెరికా పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా పెట్టిన షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని తేల్చి చెప్పింది. తాము అడిగే ఐదు ప్రధాన డిమాండ్లను నెరవేర్చితేనే, పాకిస్థాన్ వేదికగా అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ కీలక పరిణామంతో ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇప్పుడు ఈ శాంతి చర్చలపైనే పడింది. అమెరికా పంపిన 15 అంశాల ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, క్షిపణుల తయారీని ఆపేయాలని ప్రధానంగా కోరారు. అలాగే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ తన పట్టు వీడితే ఆర్థిక ఆంక్షలు తొలగిస్తామని ఆశ చూపారు. కానీ ఈ ప్రతిపాదనలను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయలేదు. తమ దేశ భద్రతను పణంగా పెట్టి ఒప్పందాలు చేసుకోలేమని తేల్చి చెప్పింది. తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే యుద్ధం ఆగుతుందని, తమ షరతులకు తలొగ్గితేనే చర్చలకు వస్తామని ఇరాన్ నాయకత్వం గట్టిగా బదులిచ్చింది. ఈజిప్ట్, టర్కీ లాంటి దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇరాన్ ప్రధానంగా ఐదు షరతులను అమెరికా ముందు ఉంచింది. మొదటిది, ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను, తమ దేశ నాయకుల హత్యలను వెంటనే నిలిపివేయాలి. రెండవది, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ ఇలాంటి యుద్ధం జరగకుండా ఉండేలా పటిష్టమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలి. మూడవది, ఈ యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీగా నష్టపరిహారం చెల్లించాలి. ఈ మూడు షరతులు నెరవేరితేనే ఎలాంటి చర్చలైనా సాధ్యమవుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. శత్రువుల దాడులకు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ఎంతకాలమైనా పోరాడుతామని ఇరాన్ సైన్యం తేల్చి చెబుతోంది. నాలుగవది, కేవలం ఇరాన్‌తో మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో ఉన్న తమ మిత్ర పక్షాలు, సాయుధ గ్రూపులన్నింటి పైనా దాడులు ఆపేయాలి. చివరిది అత్యంత కీలకమైనది, హార్ముజ్ జలసంధిపై తమకే పూర్తి సార్వభౌమాధికారం ఉందని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. ఈ ఐదు షరతులను అంగీకరిస్తేనే పాకిస్థాన్ వేదికగా జరిగే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యంగా నష్టపరిహారం చెల్లించడం, హార్ముజ్ జలసంధిపై అధికారం ఇవ్వడం లాంటివి అమెరికాకు ఏమాత్రం మింగుడుపడని విషయాలు. ఒకవైపు పాకిస్థాన్ చర్చలకు మార్గం సుగమం చేస్తున్నా, ఇరు దేశాల పంతాల వల్ల ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu