ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్మించనున్న కొత్త విమానాశ్రయాలపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఏపీలో పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. దీని వల్ల ఆ రెండు ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుందని, లాజిస్ట్రిక్స్ రంగం అభివృద్ది చేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్ రక్షణశాఖ ఆధీనంలో ఉందని, దాని పక్కన అదనపు భూమిని సేకరించి ప్రయాణికుల కోసం కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద ట్రాఫిక్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం దానికి అయ్యే ఖర్చు భరిస్తే తాము పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. ఉడాన్ 2.0 పథకం కింద మొత్తం రూ.28 వేల కోట్ల నిధులు కేటాయించగా. అందులో రూ.12 వేల కోట్ల నిధులు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం కేటాయించామని చెప్పారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ ఫైల్ వివిధ శాఖల దగ్గర ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో శంకుస్థాపన చేసేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. కొత్తగూడెం, బసంత్ నగర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి భూ కేటాయింపులు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక భోగాపురం, గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులు తుది దశకు వచ్చాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
0 Comments