గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ అరెస్ట్ : డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కేసు నమోదు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టైగర్ వుడ్స్‌ను పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడిపారన్న అనుమానంతో 'డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్' కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వుడ్స్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాలోని జూపిటర్ ఐలాండ్ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో వుడ్స్ ఈ ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు తెలిపారు. గంటకు 30 మైళ్ల వేగ పరిమితి ఉన్న రోడ్డుపై ఆయన తన ల్యాండ్ రోవర్ కారును అధిక వేగంతో నడిపారని సమాచారం. ముందున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన తర్వాత వుడ్స్ స్వయంగా కారులో నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరీక్షలు నిర్వహించగా ఆయన మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించలేదని తేలినా, ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి చేసే యూరిన్ టెస్టుకు వుడ్స్ నిరాకరించినట్లు అధికారులు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Comments
Post a Comment