ఇరాన్‌పై దాడులకు తమ సైనిక స్థావరాలు, గగనతలాన్ని ఉపయోగించడానికి అమెరికాను అనుమతించమని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబ్లెస్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించబడిన యుద్ధంలో పాల్గొనకూడదని లేదా సహకరించకూడదని స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ చర్య అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను స్పెయిన్ మొదటి నుంచే తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిర్లక్ష్యపూరితమైనవిగా, చట్టవిరుద్ధమైనవిగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ఇప్పటికే తీవ్రంగా విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అమెరికా మిత్ర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదు. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. దీంతో తమ మిత్రదేశాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న అలజడిని అణచివేసేందుకు సైనిక సహకారం అందించని దేశాలను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలం వాడారు. మీరంతా పిరికివాళ్లు (కోవార్డ్స్).. క్లిష్ట సమయంలో మీరు చేసిన ఈ పనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అంటూ హెచ్చరించారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక 'కాగితపు పులి' అని ఆయన ఎద్దేవా చేశారు.
0 Comments