హర్మూజ్ జలసంధి గుండా పాకిస్థాన్‌కు చెందిన 20 నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ‘శాంతికి సంకేతం’ అని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రతిరోజూ రెండు పాకిస్థాన్ జెండా నౌకలు ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా వెళ్లేందుకు అనుమతి లభించింది. పాకిస్థాన్ జెండాతో ఉన్న మరో 20 నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని, ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే నిర్మాణాత్మక చర్య అని ఇషాక్ దార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల ఇస్లామాబాద్, టెహ్రాన్ మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇషాక్ దార్ తన ఇరాన్ కౌంటర్‌పార్ట్ అబ్బాస్ అరాఘ్చితో ఫోన్‌లో మాట్లాడారు. శాశ్వత శాంతి కోసం చర్చలు, దౌత్యమే సరైన మార్గమని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అయితే హర్మూజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేయడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి తెలిపారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌తోపాటు మధ్యప్రాచ్య వివాదంలో పాలుపంచుకుంటున్న కొన్ని గల్ఫ్ దేశాల నౌకలకు మాత్రం ఈ మార్గంలో అనుమతి లేదన్నారు.
0 Comments