తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విద్వేష పూరిత పోస్టులకు, విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ - 2026 ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో , సోషల్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త చట్టం ప్రకారం సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో ఎవరైనా హద్దు మీరితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కొత్త బిల్లు ప్రకారం, కులం, మతం, ప్రాంతం , ఇతర విభజన అంశాల ప్రాతిపదికన వ్యక్తులను లేదా వర్గాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొదటిసారి నేరానికి పాల్పడే వారికి ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనితో పాటు రూ.50,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఒకవేళ ఇదే నేరాన్ని రెండోసారి లేదా పదే పదే చేస్తే, శిక్షా కాలం పదేళ్లకు పెరుగుతుంది . జరిమానా కూడా లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఈ నేరాలు నాన్-బెయిలబుల్ గా పరిగణిస్తారు. ఈ చట్టం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, బాధితులకు న్యాయం చేసే దిశగా కూడా అడుగులు వేసింది. విద్వేషపూరిత పోస్టుల వల్ల బాధితులు అనుభవించిన మానసిక వేదన లేదా ఇతర నష్టాలను బట్టి కోర్టులు వారికి తగిన పరిహారం ఇప్పించే వెసులుబాటు కల్పించారు. అలాగే, ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సంబంధిత నెట్‌వర్క్ ప్రొవైడర్లు, ఇంటర్మీడియరీలకు ఆదేశాలు జారీ చేసి ఆ పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటారు. కేవలం వ్యక్తులపైనే కాకుండా, విద్వేషాన్ని ప్రచారం చేసే సంస్థలు లేదా ఇన్సిట్యూషన్లపై కూడా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఒక సంస్థ ద్వారా ఇలాంటి తప్పు జరిగితే, ఆ సంస్థ నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. డిజిటల్ యుగంలో సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతున్న తరుణంలో, సామాజిక సామరస్యాన్ని కాపాడటం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఈ బిల్లును సామాజిక బాధ్యతగా చెబుతుంటే, విపక్షాలు మాత్రం దీనిని తమ గొంతు నొక్కే ప్రయత్నంగా చూస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ విమర్శలను కూడా హేట్ స్పీచ్ కింద జమకట్టి అరెస్టులు చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments