Ad Code

ఇచ్చిన అప్పు తీర్చడం ఇష్టం లేక యజమానురాలిని చంపిన పనిమనిషి!


గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో 15 ఏళ్ల క్రితం పనిమనిషిగా చేరిన రేఖా రాథోడ్ అనే మహిళ, తన యజమానురాలు శాంతి బెన్ అకేడివాలాకు అత్యంత ఆప్తురాలిగా మారింది. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం యజమాని - పనిమనిషి బంధాన్ని దాటి ప్రాణ స్నేహానికి దారితీసింది. అయితే, ఈ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకున్న రేఖ, చివరకు శాంతి బెన్ ప్రాణాలనే బలితీసుకుంది. రేఖ సొంతంగా ఫర్నీచర్ వ్యాపారం ప్రారంభించినప్పుడు, ఆమె ఆర్థిక ఇబ్బందులను చూసి శాంతి బెన్ చలించిపోయారు. సుమారు ఏడాది క్రితం పెద్ద మొత్తంలో నగదుతో పాటు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలను అప్పుగా ఇచ్చి రేఖను ఆదుకున్నారు. కానీ కాలక్రమేణా ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని శాంతి బెన్ ఒత్తిడి చేయడంతో రేఖలో క్రూరత్వం మేల్కొంది. తీసుకున్న అప్పు తీర్చడం ఇష్టం లేక, తనను నమ్మిన యజమానురాలినే అడ్డు తొలగించుకోవాలని పక్కా పథకం రచించింది. పథకం ప్రకారం మార్చి 22వ తేదీన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని శాంతి బెన్‌ను నమ్మించి తన ఫర్నీచర్ షాపునకు రేఖ పిలిపించింది. అక్కడ తన నలుగురు అనుచరులతో కలిసి ముందుగా శాంతి బెన్‌కు మత్తుమందు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేసింది. హత్య అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితులు శాంతి బెన్ మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కారు. పాలన్‌పూర్‌లోని ఒక పాడుబడిన షోరూమ్ బేస్‌మెంట్‌లో ఆ సంచిని పడేసి ఏమీ ఎరుగనట్లు ఉండిపోయారు. మార్చి 22వ తేదీ నుంచి శాంతి బెన్ కనిపించకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఆధారాలు, ఫోరెన్సిక్ లీడ్స్ సహాయంతో గాలించగా చివరకు ఆ పాడుబడిన భవనంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. అలాగే నిందితురాలు కూడా పట్టుబడింది. రేఖ చేసిన ఈ నమ్మకద్రోహంపై శాంతి బెన్ కుమార్తె నాన్సీ, సోదరి కైలాష్ బెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల కి కఠిన శిక్ష పడే వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. పదిహేనేళ్లుగా తమ ఇంట్లో మనిషిలా తిరిగిన వ్యక్తి ఇలా ప్రాణాలు తీస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రధాన నిందితురాలు రేఖా రాథోడ్‌తో పాటు ఆమె అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu