ఆస్ట్రేలియాలో ఎరుపు రంగులోకి మారిన ఆకాశం : వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్


శ్చిమ ఆస్ట్రేలియాలోని షార్క్ బే, డెన్హామ్ వంటి ప్రాంతాలలో  పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా గాఢమైన ఎరుపు రంగులోకి మారింది. ఎర్రటి ధూళి దుప్పటిలా వీధులను, ఇళ్లను, చివరికి సముద్ర తీరాన్ని కూడా కప్పేసింది. ఈ వింత భయానక దృశ్యానికి నారెల్ అనే ఉష్ణమండల తుఫాను కారణం. ఏబీసీ న్యూస్ ప్రకారం, బలమైన గాలులు ఎడారి ప్రాంతం నుండి ఇనుము అధికంగా ఉన్న ఎర్రటి మట్టిని గాలిలోకి తీసుకువచ్చాయి. ఈ ధూళి ఆకాశంలోకి వ్యాపించడంతో, దాని గుండా సూర్యకాంతి చెల్లాచెదురుగా ప్రసరించి, ఆకాశం రక్తవర్ణంలో కనిపించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మార్చి 27న, నరెల్లే తుఫాను పశ్చిమ ఆస్ట్రేలియా వాయువ్య తీరాన్ని తాకింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. బలమైన గాలుల కారణంగా విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిపోవడంతో, ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. స్థానికులు ఆ దృశ్యాన్ని 'నమ్మశక్యంకాని విధంగా భయానకంగా', 'ప్రళయంలా' ఉందని వర్ణించారు. అంతా దుమ్ముతో కప్పబడి ఉండటంతో బయట వాతావరణం 'అత్యంత భయానకంగా' ఉందని షార్క్ బే కారవాన్ పార్క్ సోషల్ మీడియాలో తెలిపింది. తుఫాను అత్యంత తీవ్రమైన ప్రభావం ఎక్స్‌మౌత్ పట్టణంలో కనిపించింది. విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, పడవలు మునిగిపోయాయి. చెవ్రాన్, వుడ్‌సైడ్, శాంటోస్‌తో సహా ప్రధాన గ్యాస్ ప్లాంట్లు కూడా ప్రభావితమయ్యాయి, దీంతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఆ తర్వాత తుఫాను తీవ్రత తగ్గి ఉష్ణమండల అల్పపీడనంగా మారినప్పటికీ, భారీ వర్షాలు, వరదల ముప్పు ఇంకా కొనసాగుతోంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ప్రాంతంలోని నేలలో ఐరన్ ఆక్సైడ్ అధిక మొత్తంలో ఉంటుంది. తుఫాను బలమైన గాలులు ఈ ఎర్రటి ధూళిని ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్లాయి. సూర్యరశ్మి ఈ ధూళిపై పడినప్పుడు, ఆకాశమంతా ఎర్రగా కనిపించింది. ఇది ఒక అరుదైన సహజ దృగ్విషయంగా పరిగణించబడుతుంది. నాసా ఉపగ్రహ చిత్రాలు కూడా నరెల్లే తుఫాను పూర్తి మార్గాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. భూతాపం కారణంగా తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయని, ప్రత్యేకమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నరెల్ తుఫాను మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ప్రయాణించడం ఈ మారుతున్న తీరును సూచిస్తుంది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం