Ad Code

అదుపు తప్పి నదిలో పడిపోయిన కారు : సోషల్ మీడియాలో వీడియో వైరల్


బీహార్‌లోని మాధేపురా జిల్లాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మార్చి 27న అర్ధరాత్రి సమయంలో గ్వాల్‌పరాలో జరిగిన ఒక మేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి ఎన్ హెచ్ -106 పై ఆరార్ ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఘనశ్యామ్ కుమార్ (28), అంకిత్ (26), వసంత్ (23), సాగర్ (22)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు ఈ యువకులు తమ కారులో ఫేస్‌బుక్ లైవ్ చేశారు. ఆ వీడియోలో వారు భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ, కేకలు వేస్తూ కనిపించారు. కారు వేగం గంటకు 140 కిలోమీటర్లు దాటినట్లు స్పీడోమీటర్ స్పష్టంగా చూపిస్తుంది. అతివేగం కారణంగా అదుపుతప్పిన కారు, తొలుత ఒక ఎలక్ట్రిక్ పోల్‌ను బలంగా ఢీకొట్టి, అక్కడి నుండి సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి ఎగిరి పక్కనే ఉన్న సుర్సార్ నదిలో పడిపోయింది. ఈ ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి చివరి వీడియో చూసి నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటం, అతివేగంతో వెళ్లడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోందని, సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైరల్ వీడియో కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu