ఏప్రిల్ 14న అందుబాటులోకి రానున్న తొలి క్వాంటం కంప్యూటర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. విద్యారథులు, పరిశోధకులు ఈ అత్యాధునిక సాంకేతికతను టెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చని క్యూబిక్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకో సిస్టమ్ ఏర్పాటుపై ఈ భేటీ జరిగింది. కాగా, ఈ సమావేశానికి మొత్తంగా 30కి పైగా క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరుకావడం విశేషం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో 7 సంస్థలు విజయవాడలోని మేధా టవర్స్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలతో అమరావతి దేశ క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.