శ్రీకాకుళంలో డయేరియా : ముగ్గురు మృతి, 76 మందికి అస్వస్థత


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో డయేరియాతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కండ్ర వీధికి చెందిన మండల సురేష్ (42) గత మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగువారి తోట, ద్వారకా నగర్ ప్రాంతానికి చెందిన సదాశివుని శేఖర్ (53) కూడా ఇదే లక్షణాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కండ్ర వీధిలో ఇంకా చాలా మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టణ పరిధిలో జరుగుతున్న వివిధ మరమ్మతు పనుల కారణంగా భూగర్భ పైపులైన్లు పగిలిపోవడంతో, మురుగు నీరు తాగునీటిలో కలిసి కొళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా అయింది. ఈ కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి అధికారులతో ఆరా తీశారు. తక్షణమే పైపులైన్ ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు వెంటిలేటర్ మీద, మరొకరు డయాలసిస్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. మరోవైపు, శ్రీకాకుళం డయేరియా ఘటనతో పాటు రాజమండ్రిలో జరిగిన పాల కలుషిత ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సీరియస్ కండిషన్‌లో ఉన్న బాధితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. రాజమండ్రి ఘటనలో పాల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం