Ad Code

సబ్ సీలో కేబుల్ నెట్ వర్క్ కీలకం : ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ


ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సబ్ సీ (సముద్ర అంతర్భాగం)లో కేబుల్ నెట్ వర్క్ కీలకమైందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటీ తెలిపారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్‌ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్‌ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు. సబ్‌మెరీన్‌ కేబుల్‌ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్‌ సీ కేబుల్, డిజిటల్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా డిజిటల్‌ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్‌ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. 'డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్‌ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది' అని లాహోటి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu