Ad Code

'టెంపుల్' ఉద్యోగ నియామకాల కోసం 'ఎక్స్‌'లో పోస్టు చేసిన దీపిందర్ గోయల్



సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ 'టెంపుల్' ఉద్యోగ నియామకాల కోసం పోస్టు చేశాడు. పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న 'టెంపుల్' అనేది ధరించదగిన పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. 'టెంపుల్' స్టార్టప్ 'క్రాఫ్ట్', 'కేటగిరీ' పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. "16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం" అని ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu