Ad Code

ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిక


తిరుమలలో దర్శనం, వసతి గదుల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకొనే సమయంలో భక్తులు అప్రమత్తంగా వుండాలని టీటీడీ హెచ్చరించింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన విధంగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం నిఘాను ముమ్మరం చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు ‘కర్ణాటక ప్రవాసి సౌధ’ పేరుతో గదులు ఇప్పిస్తామన్న నకిలీ వెబ్‌సైట్ ద్వారా మోసపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు, గూగుల్ సెర్చ్‌లో టీటీడీ పేరుతో కనిపిస్తున్న పలు ఫేక్ లింకులు భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ వెబ్‌సైట్లలో టీటీడీ లోగోలు, శ్రీవారి ఆలయ చిత్రాలను అనధికారికంగా వాడుతూ భక్తులను నమ్మిస్తున్నారని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, కాపీరైట్ చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదు చేసింది. భక్తులు తమ దర్శనం, వసతి , ఇతర సేవా టికెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్‌లో కనిపించే అనుమానాస్పద లింక్‌లను నమ్మవద్దని, దళారుల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరారు.

Post a Comment

0 Comments

Close Menu