Ad Code

ఫాల్కన్ గ్రూప్ సీఓఓ వికాస్ కుమార్ సాఖారే అరెస్ట్


డాదిన్నరగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఫాల్కన్ గ్రూప్ సీఓఓ వికాస్ కుమార్ సాఖారే (40)ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ భారీ డిపాజిట్ మోసం అని అధికారులు తెలిపారు. నిందితులు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరుతో దేశవ్యాప్తంగా మోసానికి పాల్పడినట్లు సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో ఏ27గా ఉన్న వికాస్ కుమార్  ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్దీప్ కుమార్ తో  కలిసి పెద్దఎత్తున మోసానికి తెరలేపాడని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా వెల్లడించారు.కాగా వీరు 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. అందులో 4,065 మంది డిపాజిట్ దారులకు వారి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడిందని ఆమె వివరించారు. తద్వారా రూ.792 కోట్ల నష్టం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డిపాజిట్ల సేకరించిన నిందితులు డిపాజిటర్లకు నకిలీ ఇన్వాయిస్ రసీదులు, ఒప్పందాలతో మోసం చేశారన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్లు 10/2025, 11/2025, 12/2025 కింద కేసులు నమోదు చేశామని సీఐడీ వెల్లడించింది. అదే విధంగా నిందితుల మీద దేశవ్యాప్తంగా మరో 10 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఆయా కేసుల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ దీప్ కుమార్, ఫాల్కన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ సహా పలువురిని ఇప్పటికే సీఐడీ అరెస్ట్ చేసింది.ప్రధాన నిందితుడు అమర్ దీప్ కుమార్ తో  వికాస్ కుమార్ కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు రావడంతో ఆయన మీద కేసు నమోదైంది. కాగా నిందితుడి అరెస్ట్ సందర్భంగా ఆయన వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu