నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్ష పదవికి సునేత్రా పవార్ పేరును ప్రతిపాదించగా, మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సునీల్ తత్కరే దానిని బలపరిచారు. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ ఆమె నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సునేత్రా పవార్ రాజకీయాల్లో తలపండిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె అక్టోబర్ 18, 1963న ఉస్మానాబాద్‌లో జన్మించారు. వారి తండ్రి పద్మసింహ్ పాటిల్ మాజీ మంత్రి, ఎంపీ. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత అజిత్ పవార్ భార్యగా ఆమెకు రాజకీయాలపై పట్టు ఉంది. దురదృష్టవశాత్తు అజిత్ పవార్ 2026 జనవరి 28న బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తర్వాత పార్టీ బాధ్యతలు ఇప్పుడు ఆమె భుజాన పడ్డాయి. ఆమెకు జై పవార్, పార్థ్ పవార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పార్థ్ పవార్ ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో తన ముద్ర వేశారు. 2010లో ఎన్విరాన్‌మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా స్థాపించి సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యురాలిగా విద్యా విధానాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఫ్రాన్స్‌కు చెందిన ‘వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరం’లో థింక్-ట్యాంక్ సభ్యురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీని ఐక్యంగా ఉంచడం, రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడం ఇప్పుడు సునేత్రా పవార్ ముందున్న ప్రధాన సవాళ్లు. ఆమె కుటుంబానికి అటు ఎన్సీపీ, ఇటు బీజేపీతో ఉన్న సంబంధాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తాయో వేచి చూడాలి.
0 Comments