అత్యంత చౌకైన 7-సీటర్ కారు రెనాల్ట్ ట్రైబర్ : 2 లక్షల యూనిట్ల విక్రయం
దేశీయ మార్కెట్లో సెవెన్ సీటర్ కారు రెనాల్ట్ ట్రైబర్ ఇప్పటివరకు 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. 2019 ఆగస్టులో లాంచ్ అయిన ఈ కారు సుమారు ఆరున్నరేళ్లలో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ MPVగా పేరుగాంచిన ట్రైబర్, రూ.5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే లభిస్తుండటమే దీని విజయ రహస్యం. రెనాల్ట్ ఇండియా నెలవారీ విక్రయాలు సాధారణంగా 5 వేల లోపే ఉన్నప్పటికీ, ట్రైబర్ వల్ల కంపెనీ అమ్మకాలు మళ్ళీ పుంజుకున్నాయి. జనవరి 2026 నాటికి భారత్‌లో 2,00,253 యూనిట్లు అమ్ముడవ్వగా, విదేశాలకు మరో 34,238 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. గత ఐదు ఆరు ఏళ్లలో అమ్మకాలు అప్పుడప్పుడు తగ్గినా, 2026 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 32 శాతం వృద్ధిని నమోదు చేసి తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ట్రైబర్ క్రేజ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం ఇది నిస్సాన్ గ్రావైట్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. కొత్త ట్రైబర్ మునుపటి కంటే చాలా స్టైలిష్‌గా మారింది. ఇందులో సరికొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లో డ్యూయల్ టోన్ కలర్స్ కూడా లభిస్తాయి. లోపల డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో పాటు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల టీఎఫ్ టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని 1.0 లీటర్ ఇంజన్ 72 PS పవర్, 96 Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.