తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆరుగురు మాజీ మావోయిస్టులు భేటీ అయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రధానంగా పొలిటికల్ ఎజెండాపై చర్చ జరుగుతునట్లు తెలుస్తున్నది. ఎందుకంటే సచివాలయంలోకి వెళ్తున్నప్పుడు సీఎంతో ఏం చర్చిస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా పొలిటికల్ ఎజెండా అని దేవ్‌జీ చెప్పారు. మరోవైపు మావోయిస్టు పార్టీ పరిస్థితి, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై ఇటీవల ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలిసిన వారి జీవన స్థితిగతులు, తమ కోసం ఓ సంక్షేమ పథకం తీసుకురావాలని మాజీ మావోయిస్టు నేతలు సీఎంను కోరనున్నట్లు సమాచారం. అడవుల్లో ఉన్నప్పుడు మావోయిస్టుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఏమిటనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీసే అవకాశం ఉన్నది. మాజీ మావోయిస్టు అగ్రనేతలు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ సమయంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులపై మెరుపు దాడులను ఖండించింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం మావోయిస్టులు శాంతియుతంగా లొంగిపోవాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల ఎదుట పలువురు నక్సలైట్లు లొంగిపోయిన విషయం తెలిసిందే.
0 Comments