మార్చి 1 నుంచి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ సిమ్ బైండింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది. ఈ కొత్త నిబంధన ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లో భౌతికంగా సిమ్ కార్డు ఉంటేనే సదరు నంబర్‌కు సంబంధించిన మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది. గతంలో ఒక ఫోన్‌లోని నంబర్‌తో మరొక ఫోన్ లేదా ట్యాబ్‌లో వై-ఫై ద్వారా వాట్సాప్ వంటి సేవలను పొందే వీలుండేది, కానీ ఇకపై అది సాధ్యం కాదు. సైబర్ నేరగాళ్లు ఇతరుల నంబర్లతో ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌ల ద్వారా వెబ్ వెర్షన్ వాడే వారికి కూడా నిబంధనలు కఠినతరం చేశారు. వెబ్ లాగిన్ అయిన ప్రతి ఆరు గంటలకు ఒకసారి యూజర్లు తమ ప్రామాణీకరణను మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా అథెంటికేషన్ చేయని పక్షంలో ఆ ఖాతా ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. ఆఫీసు పనుల కోసం నిరంతరం వెబ్ వెర్షన్‌పై ఆధారపడే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ, భద్రత దృష్ట్యా ఇది తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త నిబంధనల అమలు కోసం విధించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెలికాం రంగంలో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి, వినియోగదారుల డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఈ చర్యలు అవసరమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0 Comments