ఆఫ్ఘనిస్తాన్ లోని నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు


పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్ లోని పలు నగరాలపై దాడులు చేసింది. కాబూల్ లో విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది. మరో ప్రధాన నగరం కాందహార్ తో పాటు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది . సరిహద్దులపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలు క్యాంప్ లను స్వాధీనం చేసుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన జేఎఫ్-17 పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేశాయి. తూర్పు, ఆగ్నేయ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నాలుగు గంటల ఆపరేషన్‌లో రెండు పాక్ సైనిక స్థావరాలు, 19 అవుట్‌పోస్టులు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాయి. మరో నాలుగు పోస్టుల నుండి పాకిస్తాన్ సైనికులు పారిపోయినట్లు టోలో న్యూస్ తెలిపింది. అనేక ఆయుధాలు, ఓ వార్ ట్యాంక్, సైనిక రవాణా వాహనాన్ని కూడా ఆప్ఘనిస్తాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో పలువురు మరణించారని, దీనికి ప్రతీకారంగా తాము ఎదురుదాడికి దిగినట్లు ఆఫ్ఘన్ ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది సైనికులు వీరమరణం పొందినట్లు పేర్కొంది. 11 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైనిక చర్యలో ఎనిమిది మంది ముజాహిదీన్లు ప్రాణత్యాగం చేశారని, మరో 11 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాక్ అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్న వీడియోలు ఆఫ్ఘన్ మీడియా విడుదల చేసింది. అలాగే- నంగర్‌హార్‌లోని శరణార్థి శిబిరంపై పాకిస్తాన్ జరిపిన క్షిపణి దాడిలో 13 మంది పౌరులు గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2,611 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్‌ను ఆఫ్ఘనిస్తాన్ గుర్తించకపోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ సైనిక చర్యను దుస్సాహసంగా ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. మహిళలు, పిల్లలు హతమైనట్లు ఆరోపించింది. చాలా మంది పాక్ సైనికుల మృతదేహాలు తమ వద్ద ఉన్నాయని, కొందరిని సజీవంగా పట్టుకున్నామని ఆఫ్ఘన్ బలగాలు ప్రకటించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్‌తో బహిరంగ యుద్ధాన్ని ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఇప్పుడు బహిరంగ యుద్ధమేనని తేల్చి చెప్పారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org