నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు ముందుగా కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ అనుమానాస్పద వస్తువుల కోసం శోధించారు. ఈ బెదిరింపు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను గుర్తించేందుకు పోలీసులు సైబర్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.