హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో యూట్యూబర్ కోమలి బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. 21 ఏళ్ల కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలతో ఆమెకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు తెలిసింది. సుమారు మూడు సంవత్సరాలు కొనసాగిన ఈ సంబంధం ఏడాది క్రితం మనస్పర్థల కారణంగా ముగిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తరువాత కోమలి తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని కాపాడినట్లు సమాచారం. ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కోమలి తిరుమలకు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
0 Comments